జైల్లో రామాయణం చదువుతున్న ఆర్యన్ ఖాన్

24-10-2021 Sun 17:08
  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుఖ్ తనయుడు
  • ముంబయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆర్యన్
  • అధికారులను అడిగి పుస్తకాలు తెప్పించుకున్న వైనం
  • మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో పుస్తకాలతో కాలక్షేపం
Aryan Khan reading Ram and Sita book in Mumbai jail
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం ముంబయి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం... జైలులోని తన గదిలో ఆర్యన్ ఖాన్ పుస్తక పఠనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆర్యన్ జైలు గదిలో రెండు పుస్తకాలు ఉండగా, వాటిలో ఒకటి ఫిక్షన్ నవల కాగా, రెండోది రామాయణ గ్రంథం! తనకు చదువుకోవడానికి పుస్తకాలు కావాలని ఆర్యన్ జైలు అధికారులను కోరగా, జైలులో ఉన్న గ్రంథాలయం నుంచి అధికారులు రెండు పుస్తకాలు తీసుకువచ్చి ఆర్యన్ కు అందించారు. వాటిలో రామ్ అండ్ సీతా అనే టైటిల్ తో ఉన్న పుస్తకం కూడా ఉంది. ఆర్యన్ మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో పుస్తకాలతోనే కాలక్షేపం చేస్తున్నాడని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

జైల్లో ఖైదీలు చూసేందుకు వీలుగా ఓ టీవీ కూడా ఉంటుంది. అందులో వార్తలు, క్రికెట్ మ్యాచ్ లు, ఇతర క్రీడలు, వారాంతాల్లో సినిమాలు చూపిస్తుంటారు. అంతేకాదు, జైలు ఖైదీలు శని, ఆదివారాల్లో ఫుట్ బాల్, వాలీబాల్ మ్యాచ్ లు ఆడుతుంటారు. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆర్యన్ ఖాన్ ను అధికారులు ఇతర సాధారణ ఖైదీలతో కలవనివ్వడంలేదు.