అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని పట్ల చిరంజీవి ఔదార్యం

24-10-2021 Sun 14:21
  • విశాఖ వాసి వెంకట్ చిరంజీవికి వీరాభిమాని
  • గత కొంతకాలగా అనారోగ్యంతో ఉన్న వెంకట్
  • ఫ్లయిట్ టికెట్స్ ఇచ్చి తన ఇంటికి ఆహ్వానించిన చిరు
  • చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తానని హామీ
Chiranjeevi gives helping hand for a ardent fan
అభిమానులే తమ బలం అని మెగాస్టార్ చిరంజీవి ప్రతి వేదికపైనా చెబుతుంటారు. అభిమానుల క్షేమం కోసం పరితపిస్తుంటారు. విశాఖకు చెందిన ఓ వీరాభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.

విశాఖపట్నంలో నివసించే వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవిని కలవాలని, మాట్లాడాలని భావించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెలిబుచ్చాడు. ఈ విషయం ఇతర మెగా అభిమానులు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంకట్ తనను కలవొచ్చని తెలిపారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా బస్సు, రైలు ప్రయాణాలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో, ఈ విషయం గుర్తించిన చిరంజీవి పెద్దమనసుతో వ్యవహరించారు. వెంకట్ కు, ఆయన భార్య సుజాతకు విశాఖ నుంచి హైదరాబాదుకు విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
నిన్న భార్యా సమేతంగా హైదరాబాద్ వచ్చిన వెంకట్ తన ఆరాధ్య హీరో చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి మురిసిపోయారు. తన ఇంటికి వచ్చిన వెంకట్ దంపతులతో చిరంజీవి ఆప్యాయంగా ముచ్చటించారు. వెంకట్ అనారోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాదులోని ఒమేగా ఆసుపత్రికి పంపించారు. మెడికల్ రిపోర్ట్స్ పై ఒమేగా డాక్టర్లతో మాట్లాడారు. వెంకట్ విశాఖలో చికిత్స పొందవచ్చని, ఆసుపత్రి ఖర్చులను తానే భరిస్తానని ఈ సందర్భంగా చిరంజీవి భరోసా ఇచ్చారు.

మరింత మెరుగైన చికిత్స అవసరమైతే చెన్నై తరలించేందుకు అయినా తాను సిద్ధంగా ఉన్నానని, వెంకట్ వంటి అభిమానిని కాపాడుకోవడంలో రాజీపడబోనని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ ఆనందం అంతాఇంతా కాదు. చిరంజీవిని కలవాలన్న కల నెరవేరడం సంతోషదాయకం అనుకుంటే, తన అనారోగ్యానికి ఆయనే చికిత్స చేయిస్తానని ముందుకు రావడం అతడిని మరింత ఆనందానికి గురిచేసింది.

ఇక చిరంజీవి పెద్దమనసుకు అభిమానులు నీరాజనాలు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని తెలిసిందే. ఆయన ఎంతోకాలంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కార్యకలాపాలు చేపడుతున్నారు. సాయం కోరిన వారికి తన శక్తిమేర సహకరిస్తూ తన స్టార్ డమ్ కు సార్థకత చేకూర్చుతున్నారు. ఇటీవల కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ కార్మికుల క్షేమం కోసం ఆయన చూపిన చొరవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విరాళాల ద్వారా కార్మికులకు ఆర్థిక సాయంతో పాటు అన్ని విధాలా అండగా నిలిచారు.