Chandrababu: రేపు ఢిల్లీ వెళ్లనున్న 18 మందితో కూడిన టీడీపీ బృందం.. కోవింద్‌ను కలిసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్

TDP team to meet president ramnath kovind tomorrow
  • కరోనా నేపథ్యంలో చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే అపాయింట్‌మెంట్
  • ప్రధాని, హోంమంత్రిని కూడా కలిసేందుకు ప్రయత్నం
  • రెండు రోజులపాటు ఢిల్లీలోనే నేతలు

టీడీపీ కార్యాలయాలు, నేతలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు 18 మందితో కూడిన తెలుగుదేశం నేతల బృందం రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. నిజానికి హస్తినకు 18 మంది బృందం వెళ్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించింది. టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు.

రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉండే ఈ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోయిందని, డ్రగ్స్, గంజాయిసాగుకు ఏపీని కేంద్రంగా మార్చిందని టీడీపీ ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలే వీటిని  ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని పేర్కొంది. కాబట్టి 356వ అధికరణ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ కోరనుంది.

  • Loading...

More Telugu News