మూడు నెలల క్రితం పెళ్లి.. భార్యను లక్షకు అమ్మేసిన భర్త

24-10-2021 Sun 08:41
  • ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లిన ఒడిశా యువకుడు
  • భార్యను అమ్మేసి స్వగ్రామానికి చేరుకున్న యువకుడు
  • ప్రశ్నించిన అత్తమామలకు ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాధానం
Odisha Man sold his wife in Rajasthan for one lakh
మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను రాజస్థాన్ తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేసి ఎంచక్కా తిరిగి స్వగ్రామానికి చేరుకున్న ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రంలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు మూడు నెలల క్రితం సురేకెలకు చెందిన రేవతితో వివాహమైంది. ఆ తర్వాత ఉపాధి కోసం భార్యను తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత సరోజ్‌రాణా తన భార్య రేవతిని ఓ కుటుంబానికి లక్షల రూపాయలకు అమ్మేసి ఎంచక్కా ఒడిశా తిరిగి వచ్చేశాడు.

రేవతి గురించి ప్రశ్నించిన అత్తమామలకు.. ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు. అల్లుడి తీరుపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ చేరుకుని రేవతిని రక్షించి తీసుకొచ్చారు. సరోజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, భర్త తనను అమ్మేసిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని రేవతి చెప్పడం గమనార్హం.