KTR: రాజకీయాల్లో హుందాతనం గురించి కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న

  • సీఎంను బూతులు తిట్టడం ఏంటన్న కేటీఆర్
  • రాజకీయాల్లో హుందాగా మెలగాలని సూచన
  • తెలియని విషయాల్లో తలదూర్చొద్దన్న జ్యోత్స్న
  • ఇంకోసారి నోరుజారొద్దని హెచ్చరిక
TDP national spokes person Jyothsna strongly warns KTR

ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో ఉండేవారు హుందాగా మెలగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండడం గురించి కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని వ్యంగ్యంగా అన్నారు.

గతంలో తమ అధినేత చంద్రబాబుపైనా, ఇతర నేతలపైనా టీఆర్ఎస్ అధినేతలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు తెలంగాణ భవన్ పై దండెత్తాలి? అని ప్రశ్నించారు. మీకు తెలియని విషయాల్లో తలదూర్చొద్దని స్పష్టం చేశారు. "హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలా డబ్బులు పంచాలో, ఆ డబ్బులు ఎక్కడ్నించి తేవాలో అవి ఆలోచించుకో! మీ చెల్లిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసుకున్నారు. ఆమె భవిష్యత్తు ఏంటో దాని గురించి పట్టించుకోండి.

ముందు మీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడి, ఆ తర్వాత పక్క రాష్ట్రాల గురించి మాట్లాడండి. మీ నాన్న ఇచ్చిన పదవులను హాయిగా ఎంజాయ్ చేయండి. అంతేతప్ప టీడీపీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త... ఓసారి ఆలోచించుకుని మాట్లాడండి" అంటూ హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని జ్యోత్స్న పేర్కొన్నారు.

More Telugu News