Diamonds: భారత మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.. లండన్ లో వేలం!

  • ఈ నెల 27న వేలం వేయనున్న సొతెబి సంస్థ
  • ఒక్కో దాంట్లో 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల పచ్చలు
  • ఒక్కో దానికి రూ.25.8 కోట్లు వస్తాయని అంచనా
Sotheby to Auction Mughal Kings Diamond Spectacles

అలాంటి ఇలాంటి అద్దాలు కావివి.. భారత్ ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలు. వజ్రవైఢూర్యాలు, పచ్చలు పొదిగి తయారు చేసిన విలాసవంతమైన కళ్లద్దాలు. వీటిని ఈ నెల 27న లండన్ లోని సొతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. ‘ఆర్ట్స్ ఆఫ్ ద ఇస్లామిక్ వరల్డ్ అండ్ ఇండియా’ విభాగంలోని ఆ వస్తువులను జనానికి అమ్మనుంది. వజ్రఖచిత అద్దాలను ‘హాలో ఆఫ్ లైట్’గా, ఎమరాల్డ్స్ పెట్టిన కళ్లద్దాలను ‘గేట్స్ ఆఫ్ పారడైజ్’గా సొతెబీ వేలం సంస్థ పిలుస్తోంది.


దాదాపు 50 ఏళ్ల పాటు ఆ అద్దాలు ఓ ప్రైవేట్ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ తో ఈ అద్దాలను తయారు చేశారని చెప్పింది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని సంస్థ పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్ లో ప్రదర్శించింది. నిన్నటి నుంచి లండన్ లో ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఆ ప్రదర్శన జరగనుంది. మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.

More Telugu News