ఆర్యన్ డ్రగ్స్ కేసు విచారణ.. అనన్యపాండేకి ఎన్సీబీ వార్నింగ్

23-10-2021 Sat 12:49
  • విచారణకు మూడు గంటలు ఆలస్యంగా హీరోయిన్
  • ఇదేం మీ సొంత నిర్మాణ సంస్థ కాదని సమీర్ వాంఖడే సీరియస్
  • చెప్పిన టైంకు రాలేరా? అంటూ ఆగ్రహం
Ananya 3 hours late for enquiry NCB Serious
బాలీవుడ్ వర్థమాన హీరోయిన్ అనన్యపాండేకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వార్నింగ్ ఇచ్చింది. విచారణకు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న విచారణ సందర్భంగా అనన్య మూడు గంటలు ఆలస్యంగా ఎన్సీబీ ఆఫీసుకు రావడంతో.. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆమెపై మండిపడ్డారు. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారంలో ఆమెనూ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నిన్న ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా అనన్యకు అధికారులు సమన్లు ఇవ్వగా.. ఆమె మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లింది. దీంతో అనన్య మీద ఆగ్రహించిన సమీర్.. ‘‘ఇదేమి మీ సొంత నిర్మాణ సంస్థ కాదు.. ఎన్సీబీ ఆఫీసు. చెప్పిన టైంకు రాలేరా?’’ అంటూ మండిపడ్డారు. కాగా, విచారణ సందర్భంగా అనన్యను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పటికే ఆమె ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.