పాక్‌పై భార‌త్ కు మంచి రికార్డు ఉంది: 'భార‌త్, పాక్' మ్యాచ్‌ నేపథ్యంలో గంగూలీ

23-10-2021 Sat 12:14
  • ప్రపంచ కప్ లో గ‌తంలోనూ భార‌త్‌ తొలి మ్యాచ్‌లు పాక్‌తో ఆడింది
  • భార‌త్‌పై ఒత్తిడి లేదు
  • అప్ప‌ట్లో పాక్ బ‌లంగా ఉండేది
  • ఇప్పుడు టీమిండియా మ‌రింత బ‌లంగా త‌యారైంది
ganguly on ind pak match
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్‌, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ సౌరవ్ గంగూలీ ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరు దేశాల క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య గ‌తంలోనూ ప‌లుసార్లు ప్ర‌పంచ‌కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లు జ‌రిగాయ‌ని గుర్తు చేశారు.

2017లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ పాక్‌తోనే భార‌త్ తొలి మ్యాచ్ ఆడింద‌ని, ఆ ట్రోఫీలో ఫైనల్లోనూ ఇరు జ‌ట్లు త‌ల‌బ‌డ్డాయ‌ని తెలిపింది. ఇరు దేశాలు త‌మ తొలి మ్యాచ్‌లు ఆడే విష‌యంలో ఈ సంప్ర‌దాయం ఇక‌పై కూడా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ఎందుకంటే ఈ రెండు జ‌ట్లు త‌ల‌బ‌డుతున్నాయంటే ప్ర‌తి ఒక్కరికీ ఆస‌క్తి ఉంటుంద‌ని తెలిపారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నామంటే భారత జ‌ట్టుకు కాస్త ఒత్తిడి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తార‌ని, అయితే, తాను మాత్రం అలా అనుకోవ‌డం లేద‌ని తెలిపారు.

తాను గ‌తంలో బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ కు తొలిసారి అధ్య‌క్షుడిని అయ్యాక 2016లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లో ఇరు దేశాల‌ జ‌ట్ల మ‌ధ్య  మ్యాచ్‌ను ఈడెన్ గార్డులోనే నిర్వ‌హించామ‌ని గంగూలీ గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలోనూ భార‌త్ ఎటువంటి ఒత్తిడికీ గురి కాలేద‌ని ఆయ‌న తెలిపారు.

ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్‌ల‌ను ఇప్పుడు భార‌త్ లో నిర్వ‌హించడం కష్ట‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇరు దేశాల మ్యాచ్‌ల‌ టికెట్ల‌కు భారీగా డిమాండ్ ఉంద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దుబాయ్‌లోనే మ్యాచులు నిర్వ‌హించ‌డం స‌రైంద‌ని తెలిపారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో గ‌తంలో పాక్‌పై భార‌త్ అన్నీ విజ‌యాలే న‌మోదు చేసిందని ఆయ‌న అన్నారు.

పాక్‌పై భార‌త్ కు మంచి రికార్డు ఉంద‌ని తెలిపారు. పాక్ అప్ప‌ట్లో చాలా బ‌లంగా ఉండేద‌ని చెప్పారు. ఇప్పుడు టీమిండియా మునుప‌టి క‌న్నా బ‌ల‌మైన జ‌ట్టుగా తయారైందని తెలిపారు. ప్ర‌ణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ టీమిండియా పుంజుకుంటోంద‌ని చెప్పారు. భార‌త జ‌ట్టులో స‌మ‌ర్థ‌మైన కొత్త‌ క్రికెట‌ర్లు వ‌స్తున్నార‌ని తెలిపారు. టీమిండియాలో ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉంద‌ని చెప్పారు.