వీరుడ్ని, శూరుడ్ని అని చెప్పుకోవడం కాదు... డైరెక్ట్ గా తేల్చుకుందాం!: సీఎం జగన్ కు కేశినేని నాని సవాల్

22-10-2021 Fri 19:28
  • టీడీపీ ఆఫీసులో చంద్రబాబు దీక్ష
  • మద్దతు ప్రకటించిన ఎంపీ కేశినేని నాని
  • దొంగచాటు దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం
TDP MP Kesineni Nani fires on CM Jagan and YSRCP leaders
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు. నేడు పార్టీ ఆఫీసుకు వచ్చిన నాని మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ రాక్షస పాలన ఎలాంటిదో యావత్ ప్రపంచానికి చాటేలా ఇటీవల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రౌడీయిజం అనేది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.

"ఎవరూ లేని సమయంలో దొంగచాటుగా వచ్చి టీడీపీ ఆఫీసులు ధ్వంసం చేస్తారా?... వీరుడ్ని శూరుడ్ని అని చెప్పుకోవడం కాదు... విజయవాడలో ఏ గ్రౌండ్ కి వస్తారో చెప్పండి, డైరెక్ట్ గా తేల్చుకుందాం!" అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

"2019లో ప్రజలు ఒక్క చాన్స్ అనుకున్నారో, లేక నీ పాలన చూడాలనుకున్నారో గానీ నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ రకమైన అవకాశం వచ్చినప్పుడు ఎలా పరిపాలించాలి? అనేది ఆలోచించకుండా, నేను ఏంచేసినా చెల్లుతుందని అనుకోవడం జగన్ పిచ్చితనానికి నిదర్శనం. మనం చేసేవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. వారు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారు.

ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు... గతంలో మేం అధికారంలో ఉన్నాం... మా ఐదేళ్లలో విజయవాడలో ఏనాడైనా శాంతిభద్రతల సమస్య వచ్చిందా? గతంలో నీ పార్టీ వాళ్లే తప్పు చేసినా ఎంతో సహనంతో వ్యవహరించాం. కానీ ఇవాళ కిరాయి మూకలు, పోలీసులు అండగా ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపనేది ఒకటుంటుందని గుర్తించాలి.

హిట్లర్, సద్దాం హుస్సేన్ వంటి నియంతలను ఈ ప్రపంచం చూసింది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే పోయాయి. నీక్కూడా తప్పకుండా బుద్ధి చెప్పే రోజొస్తుంది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ను ఏంచేద్దామనుకుంటున్నారు?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.