ఐర్లాండ్ పై అద్భుత విజయంతో సూపర్-12 బెర్తు చేజిక్కించుకున్న నమీబియా

22-10-2021 Fri 19:05
  • గ్రూప్-ఏలో నేడు ఐర్లాండ్ వర్సెస్ నమీబియా
  • షార్జాలో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు
  • 18.3 ఓవర్లలో ఛేదించిన నమీబియా
  • అర్ధసెంచరీతో రాణించిన కెప్టెన్ ఎరాస్మస్
Namibia enters super twelve stage in world cup
టీ20 వరల్డ్ కప్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ముగిసింది. గ్రూప్-ఏలో భాగంగా నేడు షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి. ఈ పోరులో అద్భుత విజయం సాధించిన నమీబియా సూపర్-12 దశకు చేరుకుంది.

నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఐర్లాండ్ ఆశలు నెరవేరలేదు. ఓపెనర్లు స్టిర్లింగ్ 38, కెవిన్ ఓబ్రియాన్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ బాల్ బిర్నీ 21 పరుగులు సాధించాడు. మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 3, వీజ్ 2, స్మిట్ 1, స్కోల్జ్ 1 వికెట్ తీశారు.

లక్ష్యఛేదనలో నమీబియా జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 53 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అతడికి డేవిడ్ వీజ్ (28 నాటౌట్) నుంచి సహకారం లభించింది. అంతకుముందు నమీబియా ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్ 15, జేన్ గ్రీన్ 24 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్ 2 వికెట్లు తీశాడు.