ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి లేఖ అందలేదు: 'మా' ఎన్నికల అధికారి

22-10-2021 Fri 16:51
  • పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేత!
  • ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు
  • అంతకుముందే సీసీటీవీ ఫుటేజి కోరుతూ లేఖ
  • తన డ్యూటీ పూర్తయిందన్న ఎన్నికల అధికారి
MAA elections presiding officer Krishna Mohan opines on latest developments
'మా' ఎన్నికల రగడ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. పోలింగ్ ముగిసి, ఫలితాలు వెల్లడై, కొత్త కార్యవర్గం కొలువుదీరినప్పటికీ ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మంచు విష్ణుతో పోలింగ్ రోజున ఓ వైసీపీ నేత కనిపించాడంటూ ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వైసీపీ నేత ఓ రౌడీ షీటర్ అని తెలిపారు. అంతకుముందే సీసీటీవీ ఫుటేజి కావాలంటూ ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

కాగా, 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ లేఖ తనకు అందలేదని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకే తన విధి అని, ఇక తాను చేయడానికి ఏమీలేదని తెలిపారు. తర్వాతి పరిణామాలతో తనకు సంబంధం లేదని వివరించారు.