ఏపీలో జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ!

22-10-2021 Fri 16:47
  • తొలుత ఈ కేసును సీఐడీకీ అప్పగించిన హైకోర్టు
  • సీఐడీ సరిగా విచారణ జరపకపోవడంతో సీబీఐకి అప్పగింత
  • రెండు నెలల క్రితం నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
CBI arrests 6 members for social media posts on AP Judges
జడ్జిలు, కోర్టులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై ఏపీ హైకోర్టు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు మరో ఆరుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్ లను అదుపులోకి తీసుకున్నారు.

2020 అక్టోబర్ 8న ఈ కేసును సీఐడీకి హైకోర్టు అప్పగించింది. అయితే, సీఐడీ అధికారులు కేసును సక్రమంగా విచారించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీబీఐకి అప్పగించింది. గత జులై, ఆగస్ట్ నెలల్లో  సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేసింది. మరోవైపు ఈనెల 6న హైకోర్టుకు సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించింది.