'అంకుశం' సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు గుడ్డలూడదీసి కొడతాం: యరపతినేని శ్రీనివాసరావు

22-10-2021 Fri 15:37
  • రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటో డీజీపీ అర్థం చేసుకోవాలి
  • తాడేపల్లి కొంప ఎప్పుడో కూలిపోయింది
  • అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో అందరి భరతం పడతాం
Yarapathineni Srinivasa Rao comments on AP DGP
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి డీజీపీ కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కొన్ని నెలల్లో డీజీపీ రిటైర్ కాబోతున్నారని... రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని అన్నారు.

 సీఎం జగన్ ను ఏదో అంటే వైసీపీ వాళ్లకు బీపీ వచ్చి దాడి చేశారంట... గతంలో చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాకు బీపీ రాలేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తాడేపల్లి కొంపను కూల్చాలని తమ కార్యాకర్తలు అంటున్నారని... ఆ కొంప ఎప్పుడో కూలిపోయిందని... ఆ కొంపను ఇప్పుడు కూల్చాల్సిన అవసరం లేదని చెప్పారు.

వైసీపీ నేతల భాషను తాము కూడా మాట్లాడగలమని... ఏంట్రా నాకొడకల్లారా అని అనగలమని... కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందని యరపతినేని అన్నారు. తమ అధినేత చంద్రబాబు మంచిగా ఉండొచ్చని.. తాము మాత్రం ఆయన అంత మంచి వాళ్లం కాదని చెప్పారు. వైసీపీ వాళ్ల మాదిరి బరితెగించే వాళ్లు తమ పార్టీలో కూడా ఉన్నారని అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి వెనుక డీజీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

ఏ ఒక్కరినీ వదలబోమని... టీడీపీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో అందరి భరతం పడతామని యరపతినేని హెచ్చరించారు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు... బట్టలూడదీసి కొడతామని అన్నారు. ఒకవైపు ఉన్న చంద్రబాబుని కాకుండా... రెండో వైపు ఉన్న లోకేశుని చూడాలని... మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.