ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారో చంద్రబాబుకు తెలియదా?: సజ్జల

22-10-2021 Fri 14:50
  • గుంటూరులో వైసీపీ జనాగ్రహ దీక్ష
  • జగన్ పై అడ్డగోలుగా మాట్లాడారంటూ సజ్జల ఆగ్రహం
  • లేని అంశంపై రచ్చ చేశారని మండిపాటు 
  • చంద్రబాబు డైరెక్షన్ లోనే పట్టాభి మాట్లాడారని ఆరోపణ
Sajjala slams TDP and Chandrababu
గుంటూరులో వైసీపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని చంద్రబాబు నిరూపించారని విమర్శించారు. లేని అంశంపై టీడీపీ రచ్చచేసిందని అన్నారు. సీఎం జగన్ ను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడారని, పట్టాభి నానావిధాలుగా దుర్భాషలాడారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రణాళికలో భాగంగానే పట్టాభి మాట్లాడాడని విమర్శించారు. జగన్ ను తిడితే వైసీపీ కార్యకర్తలకు కోపం రాదా? అని ప్రశ్నించారు. "బూతులు మాట్లాడే హక్కు మాకుందని అంటున్నారు. బూతులు మాట్లాడే హక్కు కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నట్టుంది. చంద్రబాబు రాష్ట్రపతి పాలన ఏ విధంగా కోరతారు? ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారో చంద్రబాబుకు తెలియదా? చంద్రబాబువి చిల్లర రాజకీయాలు" అని వ్యాఖ్యానించారు.