‘జోక్ చేశానంతే’.. గంజాయి డ్రగ్ అన్న విషయం తెలియదు.. ఆర్యన్ ఖాన్ కేసులో అనన్య వివరణ!

22-10-2021 Fri 12:59
  • అనన్యను విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు
  • తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన వైనం
  • సిగరెట్ల గురించే అనుకున్నానని ఆన్సర్
Ananya Says Thats Just A Joke regarding Chats with Aryan
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్య పాండే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. కేసుకు సంబంధించి అనన్యను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గంజాయి సరఫరా చేస్తానంటూ ఆర్యన్ తో చాట్ చేసిన విషయంపై ఆమెను ప్రశ్నించారు. అయితే, ఆర్యన్ తో తాను జస్ట్ జోక్ చేశానని ఆమె సమాధానం చెప్పింది. ఆర్యన్ ఖాన్, అనన్య పాండేలు గంజాయి గురించి చాటింగ్ చేసిన మెసేజ్ లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చాటింగ్ సందర్భంగా గంజాయి దొరికే మార్గముందా? అంటూ అనన్యను ఆర్యన్ అడిగాడని, అందుకు ఆమె తాను అరేంజ్అ చేస్తానంటూ సమాధానమిచ్చిందని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. అయితే, గురువారం విచారణ సందర్భంగా మాత్రం అది జోక్ అంటూ సమాధానమిచ్చిందన్నారు. ఆర్యన్ కు అనన్య డ్రగ్స్ గానీ, గంజాయి గానీ సరఫరా చేసిందనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు.

విచారణ కోసం నిన్న ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లిన ఆమె.. లోపలికి వెళ్లే ముందు తన తండ్రి చంకీ పాండేను పట్టుకుని ఏడ్చేసింది. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ లు తమకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఎన్సీబీ అధికారులకు సమాధానమిచ్చింది. ధీరూభాయ్ అంబానీ స్కూల్ లో ఆర్యన్ తో కలిసి చదువుకున్నానని తెలిపింది. ఇప్పుడు షూటింగ్ లు లేకుంటే సమయం దొరికినప్పుడల్లా కలుస్తామని చెప్పింది. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, సరఫరా కూడా చేయలేదని స్పష్టం చేసింది. తనతో కేవలం సిగరెట్ల గురించే ఆర్యన్ చాట్ చేశాడని, డ్రగ్స్ గురించి కాదని ఆమె తెలిపింది. గంజాయి కూడా ఓ మాదక ద్రవ్యం అన్న విషయం తనకు తెలియదని ఆమె సమాధానమిచ్చింది.