Chinta Mohan: కాపు సామాజిక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి: చింతా మోహన్

  • వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
  • రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
  • దేశాన్ని అమ్మేందుకే  మోదీ పని చేస్తున్నారు
Chintha Monhan wants Kapu leader to become CM

రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ నేతలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మోదీ పాలనలో దేశ పరిస్థితి దిగజారిందని చింతా మోహన్ విమర్శించారు. సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతున్నా మౌనంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. ఎన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో కేంద్ర ప్రభుత్వం వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామంటూ మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని... కాంగ్రెస్ హయాంలో ఎన్నో విలువైన వ్యాక్సిన్లను వేసినప్పటికీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదని అన్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చెందిన పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ దొరికినా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. భారత్ ను అమ్మేసేందుకు మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు దొరక్కపోయినా డ్రగ్స్ మాత్రం దొరుకుతున్నాయని అన్నారు.

More Telugu News