Osmania University: నకిలీ పరిశోధన ఫలితాలతో అమెరికా సంస్థను తప్పుదోవ పట్టించిన తెలుగు శాస్త్రవేత్త.. ఐదేళ్ల పాటు డిబార్

Telugu scientist who misled the American company with fake research results debar
  • జన్యు సంబంధిత అంశాలపై పరిశోధన
  • ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టిన ఓఆర్ఐ
  • పరిశోధనలో భాగస్వామిగా ఓయూ ప్రొఫెసర్
  • అమెరికా నుంచి కేంద్రానికి లేఖ
  • విచారణ చేపట్టాలంటూ ఓయూకు కేంద్రం ఆదేశం
అమెరికాలో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన పరిశోధనలో తప్పుడు ఫలితాలతో ఓ సంస్థను, నేచర్ జర్నల్‌ను బురిడీ కొట్టించినందుకు గాను ఓ తెలుగు శాస్త్రవేత్తను అక్కడి అధికారులు ఐదేళ్లపాటు డిబార్ చేశారు. ఈ వ్యవహారంలో ఉస్మానియా యూనివర్సిటీలో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా ప్రొఫెసర్ కూడా ఉన్నారు. దీంతో విచారణ జరిపించాలంటూ కేంద్రం నుంచి ఓయూకు లేఖ అందింది.

ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలతో కలిసి సమర్పించిన పరిశోధన ఫలితాలపై అనుమానం వచ్చిన అమెరికా ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ (ఓఆర్ఐ) విచారణ చేపట్టగా అది నకిలీ పరిశోధనగా వెల్లడైంది. దీంతో ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా ప్రధాన శాస్త్రవేత్తను ఐదేళ్లపాటు డిబార్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ కీలక విభాగం ఆర్థిక సాయంతో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన పరిశోధనలో అమెరికాలోని ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలతోపాటు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్  ఒకరు భాగస్వామిగా ఉన్నారు.

ప్రఖ్యాత నేచర్ జర్నల్‌లోని సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో 2014లో వీరి పరిశోధన పత్రం ప్రచురితమైంది. అయితే, ఆ ఫలితాలను అనుమానించిన ఓఆర్ఐ అవి నకిలీ ఫలితాలని తేల్చి ప్రధాన శాస్త్రవేత్తపై నిషేధం విధించింది. ఈ వ్యవహారంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ భాగస్వామిగా ఉన్నట్టు అమెరికా ఫెడరల్ రిజిస్టర్, సైంటిఫిక్ రిపోర్ట్స్ నుంచి భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి (డీఎస్‌టీ) నివేదిక అందింది.

దీంతో విచారణ జరిపించాలంటూ కేంద్రం నుంచి ఓయూకు లేఖ అందింది. ఓయూలో కీలక స్థానంలో ఉన్న ఆమె ఈ విషయమై మాట్లాడుతూ.. తాను సహరచయితగా మాత్రమే ఉన్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి లేఖ వచ్చినమాట నిజమేనని, త్వరలోనే విచారణ చేపడతామని ఓయూ ఉప కులపతి డి.రవీందర్ తెలిపారు. మరోవైపు, ప్రచురించిన నకిలీ ఫలితాల పత్రాన్ని నేచర్ జర్నల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
Osmania University
America
professor
Telugu Scientist

More Telugu News