ప్రేమ నిరాకరించిన యువతిపై కక్ష.. బహుమతిగా గంజాయి ప్యాకెట్టు ఇచ్చి మూడేళ్ల తర్వాత కటకటాలపాలైన యువకుడు

Man gave Ganja In the form of Gift as she rejects his love
  • గంజాయిని గిఫ్ట్ ప్యాకెట్‌లా మార్చి యువతికి బహూకరణ 
  • ఆపై రైల్వే పోలీసులకు ఫోన్ చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తోందని ఫిర్యాదు
  • సికింద్రాబాద్‌లో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణలో యువకుడి పనేనని తేలిన వైనం
తన ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు బహుమతిగా గంజాయి ప్యాకెట్లు పంపి కటకటాలపాలయ్యాడు. సికింద్రాబాద్‌లో జరిగిందీ ఘటన. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన వినయ్ కుమార్ (25) ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు చదువుకుని ఈవెంట్స్ నిర్వాహకురాలిగా పనిచేస్తున్న యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో 31 మే 2018న యువతి తన పనిలో భాగంగా ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి శిర్డీసాయి ఎక్స్ ప్రెస్‌లో సికింద్రాబాద్ బయలుదేరింది. విషయం తెలిసిన వినయ్.. 'మన స్నేహానికి గుర్తు' అంటూ ఓ గిఫ్ట్ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు. ఆ తర్వాతి రోజు రైలు సికింద్రాబాద్ చేరుకోవడానికి ముందు వినయ్ జీఆర్పీ పోలీసులకు ఫోన్ చేసి ఓ యువతి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందించాడు.

రైలు సికింద్రాబాద్‌లో ఆగిన తర్వాత తనిఖీలు చేసిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆ ప్యాకెట్‌లో ఉన్న మూడు కిలోల గంజాయి బయటపడింది. దీంతో అవాక్కైన ఆమె అసలు విషయం చెప్పింది. గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో అతడే ఆమెకు గంజాయిని ఇచ్చి మోసం చేసినట్టు విచారణలో పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు.

విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తెసుకెళ్లి ఆమెను వదిలిపెట్టారు. అదే రోజు వినయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసేమీ లేదని, కొంత సమాచారం కోసం స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు నిన్న వినయ్‌కు చెప్పగా వచ్చాడు. విచారణలో ఆ గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చింది తానేనని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Go Back to Shorts
Visakhapatnam
Hyderabad
Love
Ganja

More Telugu News