100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ హర్షణీయం: పవన్ కల్యాణ్

21-10-2021 Thu 20:40
  • భారత్ లో 100 కోట్ల కరోనా డోసుల పంపిణీ
  • ఇది ప్రధాని మోదీ విజయమన్న పవన్ కల్యాణ్
  • మోదీకి ధన్యవాదాలు అంటూ ప్రకటన
  • వైద్య, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు
Pawan feels happy with hundred crore vaccination in country
భారత్ లో ఇప్పటిదాకా అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్లు దాటడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఘనత సాధించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు.

కరోనా సంక్షోభంతో భారత్ లో కోట్ల మంది చనిపోతారని డబ్ల్యూహెచ్ఓ, ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేశారని, వాటన్నింటిని అధిగమించిన భారత్ వ్యాక్సినేషన్ లో 100 కోట్ల మార్కును దాటిందని పవన్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలోని ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, వైరాలజిస్టులు, ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.