గంజిలో ఈగ మాదిరి దళితులను కేసీఆర్ తీసిపారేశారు: ఈటల రాజేందర్

21-10-2021 Thu 15:33
  • దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు
  • ఇప్పుడు దళితబంధుతో మళ్లీ మోసం చేసేందుకు యత్నిస్తున్నారు
  • దళితబంధును ఎవరూ వద్దనడం లేదు
KCR cheated Dalits says Etela Rajender
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... మాట తప్పను అని అందరినీ నమ్మించారని, మాట తప్పితే తల నరుక్కుంటానని అన్నారని... చివరకు ఆయనే గద్దెనెక్కారని ఈటల విమర్శించారు.

దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్ ది అని, గంజిలో ఈగ మాదిరి దళితులను తీసి పారేశారని చెప్పారు. దళితులను ఎప్పుడూ మోసం చేస్తూనే వచ్చారని, సబ్సిడీ రుణాలు, డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు దళితబంధుతో మళ్లీ మోసం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.

దళితబంధు పథకాన్ని ఎవరో ఆపుతున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఈటల దుయ్యబట్టారు. దళితబంధును ప్రతి దళితుడికీ ఇవ్వాలని తానే కోరుతున్నానని చెప్పారు. దళితబంధును ఎవరూ వద్దనడం లేదని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్లే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్లకు కూడా ఇళ్లు కట్టుకునే జీవోలు వస్తున్నాయని చెప్పారు.

ఎన్నికలు ఉంటేనే హామీలు, చెక్కులు ఇస్తారని, లేకపోతే ఇవ్వరని ఇదే కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. ఈ నెల 30 తర్వాత స్థానిక టీఆర్ఎస్ నేతల బతుకులు బజారుపాలేనని చెప్పారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.