చంద్రబాబు దీక్ష ఒక క్షుద్ర కార్యక్రమం: మంత్రి పేర్ని నాని

21-10-2021 Thu 14:35
  • ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడి
  • చంద్రబాబు 36 గంటల దీక్ష
  • దొంగ దీక్ష అంటూ విమర్శలు గుప్పించిన పేర్ని నాని
  • బూతు మాట కోసం దీక్ష చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
Perni Nani criticizes Chandrababu protest
రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టడంపై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు చంద్రబాబు దీక్షను ఓ క్షుద్ర కార్యక్రమంగా అభివర్ణించారు. ఇది 36 గంటల దొంగ దీక్ష అని పేర్కొన్నారు. చంద్రబాబు దీక్ష ఎవరికోసం? వారి పార్టీ నేత మాట్లాడిన బూతులను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. స్క్రిప్టు రాయించి మరీ బూతులు మాట్లాడిస్తూ శునకానందం పొందుతున్నారని పేర్ని నాని ఆరోపించారు.

గుజరాత్ లో అమాయకులను అప్పట్లో బ్రిటీష్ వాళ్లు బద్మాష్ అని పిలిచేవారని టీడీపీ నేతలు చెబుతున్నారని, అదే నిజమైతే టీడీపీ పార్టీలో పయ్యావుల కేశవ్ కంటే బద్మాష్ ఇంకెవరుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కార్యాలయంలో రెండు బల్లలు విరిగినంత మాత్రాన రాష్ట్రపతి పాలన విధించాలా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అమిత్ షాపై రాళ్లదాడి జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన గుర్తుకురాలేదా? అమిత్ షాపై అల్లరిమూకలను ఎగదోసినప్పుడు ఆర్టికల్ 356 గుర్తుకురాలేదా? అని నిలదీశారు.

చంద్రబాబు జీవితమంతా నేరమయమని, ఇవాళ ఒక బూతు మాట కోసం దొంగ దీక్ష చేస్తూ మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నిజంగా ఇది జగన్ దురదృష్టం అని, ఇలాంటి దిక్కుమాలిన విపక్షనేతను కలిగి ఉండడం జగన్ దౌర్భాగ్యం అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

చంద్రబాబు బంద్ కు పిలుపునిస్తే కనీసం ఒక్క దుకాణదారుడు అయినా స్వచ్ఛందంగా మూసివేశాడా? కనీసం వారి కుటుంబ వ్యాపార సంస్థలోనూ బంద్ ను పాటించే పరిస్థితి ఉందా? అంటూ విమర్శించారు. 2016లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రజాసంఘాలు బంద్ కు పిలుపునిస్తే... రాష్ట్రంలో ఉత్పాదకత కుంటుపడుతుంది, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, రాష్ట్రంపై చెడుముద్ర పడుతుంది అంటూ చెప్పింది చంద్రబాబు కాదా? మరి ఇవాళ అదే చంద్రబాబు ఎందుకు బంద్ కు పిలుపునిచ్చినట్టు? అని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.