త్వరలోనే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్: ఏపీ సీఎం జగన్

21-10-2021 Thu 13:43
  • పోలీసులకు ఇవాళ్టి నుంచే మళ్లీ వీక్లీ ఆఫ్
  • పోలీసుల సేవలకు ప్రభుత్వ ప్రాధాన్యం
  • సాంకేతికతకు తగ్గట్టు పోలీసుల బాధ్యతలు విస్తరించాలి
  • వైట్ కాలర్ నేరాలను అరికట్టాలి
Jagan Says Soon will Release Police Job Notification
పోలీస్ అమరువీరుల దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దేశంలో తొలిసారి వీక్లీ ఆఫ్ లను అమలు చేస్తున్నామని, కరోనా కారణంగా అది కొన్నాళ్లు వాయిదా పడిందని, ఇవాళ్టి నుంచి మళ్లీ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇవాళ పోలీసు అమర వీరులకు ఆయన నివాళులర్పించారు.

పోలీసుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకే గత ప్రభుత్వం బకాయిపడిన నిధులు రూ.1,500 కోట్లు విడుదల చేశామని చెప్పారు. హోంగార్డుల గౌరవ వేతనాన్నీ పెంచామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీస్ శాఖలో కొత్తగా 16 వేల మందిని నియమించామని గుర్తు చేశారు. కరోనాతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున మంజూరు చేశామని, మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో రూ.5 లక్షలూ ఇస్తున్నామని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు పోలీసుల బాధ్యతలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వైట్ కాలర్ నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.