తండ్రిని చూడగానే 'అయామ్ సారీ' అంటూ బావురుమన్న ఆర్యన్ ఖాన్!

21-10-2021 Thu 13:03
  • ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన షారుఖ్
  • 18 నిమిషాల సేపు కొడుకుతో మాట్లాడిన వైనం
  • ఎక్కువ సేపు ఏడుస్తూనే ఉన్న ఆర్యన్
Shahrukh Khan went to jail to meet Aryan Khan
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2వ తేదీన ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆర్యన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు తన కుమారుడిని కలిసేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు షారుఖ్ వెళ్లారు. గ్లాస్ డోర్ అవతల ఆర్యన్, ఇవతల షారుఖ్ కూర్చొని... ఇంటర్ కామ్ ద్వారా మాట్లాడుకున్నారట. దాదాపు 18 నిమిషాల సేపు వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. అయితే తన తండ్రితో మాట్లాడుతున్న సమయంలో ఎక్కువ సేపు ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడట. 'అయామ్ సారీ' అని పదేపదే తన తండ్రికి చెప్పాడు.

ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన షారుఖ్, ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడని చెపుతున్నారు. నేను నిన్ను నమ్ముతున్నానంటూ కొడుకులో షారుఖ్ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. 18 నిమిషాల తర్వాత ఆయన బయటకు వచ్చారు.