Payyavula Kesav: దాడి చేసిన ఈ వ్యక్తి డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్నారు... ఫొటో చూడండి: పయ్యావుల కేశవ్

  • తమ పిల్లలు డ్రగ్స్ బానిసలవుతారని తల్లిదండ్రులు భయపడుతున్నారు
  • వేదికపై నుంచి ఈరోజు జగన్ కూడా అదే పదాన్ని ఉచ్చరించారు
  • డ్రగ్స్ గురించి మాట్లాడితే జగన్ కేసులు పెట్టిస్తున్నారు
Payyavula Keshav reveals photo of police officer who attacked TDP office

బ్రిటీష్ కాలంలోనే బోసడీకే అని పిలిచే సంప్రదాయం ఉన్నట్టు కొందరు చెపుతున్నారని.... ఆ పదానికి అర్థం 'మీరు బాగున్నారా' అని అంటూ మరికొందరు భాష్యం చెపుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ రాద్ధాంతానికి కారణం ఏమిటనే దానిపై మాట్లాడకుండా... పరిస్థితిని పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతున్నాయని దేశ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారని... గంజాయికి తమ పిల్లలు ఎక్కడ బానిసలు అవుతారో అని తల్లిదండ్రులు భయపడుతున్నారని అన్నారు. అందుకే డ్రగ్స్ పై చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని చెప్పారు.

డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని గుర్తు చేశారు. విద్యాసంస్థల వద్ద నిఘా పెట్టాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. గంజాయి సాగుచేసే వారి భూమి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారని తెలిపారు. మన సీఎం మాత్రం డ్రగ్స్ గురించి మాట్లాడితే కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపై జరిగిన దాడి ప్రభుత్వం, డీజీపీ కనుసన్నల్లోనే జరిగిందని చెపారు. డీజీపీ కార్యాలయం పీఆర్వో కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తి టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా సదరు వ్యక్తి ఫొటోను మీడియాకు పయ్యావుల చూపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆయనచేతే నారా లోకేశ్ పై కేసు పెట్టించారని విమర్శించారు. ఈ అంశంపై సీబీఐ చేత విచారణ జరపించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.

డీజీపీ సరైన చర్యలను ఇప్పుడు తీసుకోకపోతే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే మీరు కూడా సామాన్యుడిగానే మారిపోతారంటూ డీజీపీని ఉద్దేశించి చెప్పారు. జరుగుతున్న పరిణామాల్లో కిందస్థాయి పోలీసుల తప్పు లేదని... పోలీస్ అధికారులదే మొత్తం తప్పని అన్నారు. ఐపీఎస్ అధికారిగా మీరు చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. ఇంటికి వెళ్లి మీ భార్యా పిల్లలను అడగాలని... మీరు చేస్తున్నది కరెక్టేనా అనేది అడిగి తెలుసుకోవాలని చెప్పారు.

టీడీపీ కార్యాలయంపై 10 మంది పోలీసులు దాడి చేశారని... ఆఫీసులోని సీసీ కెమెరాల్లో ఫుటేజీ రికార్డయిందని అన్నారు. ఈ ఫుటేజీని కోర్టులకు అందిస్తామని చెప్పారు. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బాధను కలిగించాయని అన్నారు. డగ్స్ వ్యవహారంపై మాట్లాడకుండా... తన నాయకుడు అన్న ఒక పదాన్ని సీఎం కూడా వేదికపై ఉచ్చరించారని చెప్పారు. అసలైన సమస్యను తప్పుదోవ పట్టించేందుకే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇదే పదాన్ని మీ మంత్రులు గతంలో అనలేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News