TV Actress: విమానంలో టీవీ నటితో వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన.. అరెస్ట్

UP Business Man Arrested for misbehave with TV Actress
  • ఈ నెల 3న ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో నటి
  • నడుముపై చెయ్యి వేసి ఒళ్లోకి లాక్కున్న వ్యాపారవేత్త
  • ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ నటిపై ఒత్తిళ్లు
విమానంలో టీవీ నటితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న టీవీ నటి విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లింది.

ముంబైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన లగేజీని తీసుకునేందుకు నటి లేచి నిల్చోగా పక్క సీట్లో ఉన్న వ్యాపారవేత్త ఆమె నడుమును పట్టుకుని ఒక్కసారిగా లాగి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి నటి ఖిన్నురాలైంది. ఆ తర్వాత వ్యాపారవేత్త వివరణ ఇస్తూ.. పురుషుడు అనుకుని అలా చేశానని చెబుతూ ఆమెకు క్షమాపణ చెప్పాడు.

నటి ఇంటికి వెళ్లిన తర్వాత విమానంలో జరిగిన విషయాన్ని విమానయాన సంస్థకు మెయిల్ చేసి ఆ వ్యక్తి వివరాలు కావాలని కోరింది. అయితే, అతడి వివరాలను తాము ఇవ్వలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో ఆమె ఆ తర్వాతి రోజున ముంబైలోని సహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన నిందితుడైన వ్యాపారవేత్తను ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు.

నిన్న అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా 24 గంటలపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. మరోవైపు, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారవేత్త కుటుంబం నుంచి తనకు ఒత్తిళ్లు వస్తున్నట్టు నటి పేర్కొంది. వ్యాపారవేత్త భార్య, మరో వ్యక్తి తన ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అడిగారని, వారికి తన ఇంటి అడ్రస్ కూడా తెలిసిపోయిందని, మళ్లీ వస్తారేమోనని భయంగా ఉందని నటి వాపోయింది.
TV Actress
Mumbai
New Delhi
Business Man
Air Plane

More Telugu News