Team India: టీ20 ప్రపంచకప్: వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్

  • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం
  • టీ20 ప్రపంచకప్‌లో నిన్న రెండు మ్యాచ్‌లు
  • ఐర్లండ్‌పై శ్రీలంక భారీ విజయం
  • నెదర్లాండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన నమీబియా
India stuns Australia in their second warmup Match

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచుల్లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 2.1 ఓవర్లు ఉండగానే చేరుకుంది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 38, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్మిత్ 57, మ్యాక్స్‌వెల్ 37, స్టోయినిస్ 41 పరుగులు (నాటౌట్) చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.

మరోవైపు, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న రెండు మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్-ఏ లో శ్రీలంక-ఐర్లాండ్ పోటీ పడగా, శ్రీలంక 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే గ్రూప్‌లో నమీబియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

More Telugu News