చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మోదీ, అమిత్ షాకు ఎప్పుడో తెలుసు: కొడాలి నాని తీవ్ర విమర్శలు

20-10-2021 Wed 20:13
  • పట్టాభి డబ్బులు తీసుకుని తిడుతున్నాడు
  • ఎంతమంది చంద్రబాబులు వచ్చినా జగన్ ను కదిలించలేరు
  • పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టిస్తున్నారు
Amit Shah knows about Chandrababu says Kodali Nani
చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయించారని అన్నారు. పట్టాభి డబ్బులు తీసుకుని తిడుతున్నాడని ఆరోపించారు. వైసీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొడుతున్నారని చెప్పారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

 చంద్రబాబులాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జగన్ ను కొంచెం కూడా కదిలించలేరని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి చంద్రబాబు తిట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని చెప్పారు. సీఎం జగన్ ను పట్టాభి ఎంతో అవమానించారని అన్నారు.

తిరుమలకు వచ్చినప్పుడు అమిత్ షాపై చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మోదీ, అమిషాకు ఎప్పుడో తెలుసని అన్నారు. ఇప్పుడు అమిత్ షాను కలుస్తానని చంద్రబాబు చెపుతున్నారని... ఏ మొహం పెట్టుకుని ఆయనను కలుస్తారని ప్రశ్నించారు.

తాడేపల్లి నుంచి ప్రపంచానికి జగన్ గంజాయి సరఫరా చేస్తున్నారని గత 10 రోజుల నుంచి టీడీపీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్ ను ఇబ్బంది పెట్టాలని యత్నిస్తున్నారని విమర్శించారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి జరిగినప్పుడు పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని... ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో రెండు కుర్చీలు విరగ్గానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు.