'శ్యామ్ సింగ రాయ్'లో సాయిపల్లవి సాంగ్ హైలైట్ అట!

20-10-2021 Wed 19:10
  • సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్
  • ఆమె డాన్సులకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్
  • 'శ్యామ్ సింగ రాయ్'లో దసరా ఉత్సవం డాన్స్
  • డిసెంబర్ 24వ తేదీన సినిమా విడుదల  
Shyam Singha Roy movie update
సాయిపల్లవి .. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఒక సినిమా చేస్తుందంటే ఆ కథలో విషయం ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ కి ఆమె కలిగించగలిగింది. ఇక కథానాయికలలో ఆమె రేంజ్ లో డాన్స్ చేసేవారు ఎవరూ లేరనే ఒక పేరును కూడా సొంతం చేసుకుంది.

సాయిపల్లవికి ప్రతి సినిమాలోను ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉండటం .. ఆ సాంగ్ ఆ సినిమాకి హైలైట్ గా నిలవడం .. ఆ సాంగ్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ లభిస్తుండడం విశేషంగా మారింది. 'ఫిదా'లో 'వచ్చిండే .. 'పాట, ' లవ్ స్టోరీ'లోని 'సారంగధరియా .. ' పాటలు జనంలోకి .. సోషల్ మీడియాలోను రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి.

ఇక ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేకమైన సాంగ్ 'శ్యామ్ సింగ రాయ్'లోను ఉందట. కలకత్తా .. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారట. క్లాసికల్ డాన్స్ టచ్  తో సాగే ఈ పాటలో సాయిపల్లవి డాన్స్ చూసి తీరవలసిందే అంటున్నారు. ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.