Nara Lokesh: చంద్రబాబుకు ఉన్నంత సహనం నాకు లేదు.. మీ వీపులు పగులుతాయ్: నారా లోకేశ్

I dont have as much patience as Chandrababu warns Nara Lokesh
  • రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగింది
  • నాలుగు అద్దాలు పగిలినంత మాత్రాన భయపడబోము
  • జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును ఎన్నో తిట్లు తిట్టారు
టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా... దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని చెప్పారు. ఏపీ నుంచే గంజాయి ఎక్కువగా వస్తోందని సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారని అన్నారు.

 డ్రగ్స్ పై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని... ఏపీ సీఎం జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. గంజాయిని నివారించాలనే ఆలోచన పోలీసులకు లేదని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో నాలుగు అద్దాలు పగిలినంత మాత్రాన తాము భయపడబోమని నారా లోకేశ్ అన్నారు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరించారు.

తమ అధినేత చంద్రబాబుకు ఉన్నంత సహనం తనకు లేదని లోకేశ్ చెప్పారు. దేవాలయం వంటి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని... వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వారి కార్లు డీజీపీ కార్యాలయం ముందు నుంచే వచ్చాయని... దాడి తర్వాత కూడా మళ్లీ అటువైపే వెళ్లాయని చెప్పారు.

 పోలీసులను మఫ్టీలో పంపించి దాడులు చేయించారని ఆరోపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని... చంద్రబాబును కాల్చాలని ఆయన అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులను వైసీపీ నేతలు ఎన్నో తిట్లు తిట్టారని... అయినా వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Chandrababu
Jagan
YSRCP

More Telugu News