Jagan: ప‌రుష ప‌ద‌జాలం.. దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు

  • నేను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఇలా మాట్లాడ‌లేదు
  • ఏపీలో సంక్షేమ పాలనను టీడీపీ ఓర్వలేకపోతోంది
  • ఎవరూ మాట్లాడని బూతులు మాట్లాడుతున్నారు
jagan slams tdp

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ఆయ‌న చెప్పారు.

తాము ఏపీలో అందిస్తోన్న‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. తాము ఏపీలో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

దీంతో ప్రతిపక్షం ఎలా తయారయిందో ఏపీ ప్రజలే గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోందని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

వారి ప్రతిమాటలోనూ వంచన కనిపిస్తోందని, మత విద్వేషాలను సైతం రెచ్చగొట్టేందుకు టీడీపీ వెనకాడదని అన్నారు. కావాల‌నే తిట్టించి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు.
తాను ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని, ఇప్పుడు వారికి సాయం చేస్తున్నామ‌ని తెలిపారు.  

వారికి ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఏడాదిలో రెండుసార్లు ‘జగనన్న తోడు’ కార్యక్రమం ఉంటుంద‌ని చెప్పారు.

More Telugu News