చంద్రబాబు పార్ట్‌న‌ర్ పవన్ క‌ల్యాణ్‌ సమర్థన సిగ్గుచేటు: బొత్స మండిపాటు

20-10-2021 Wed 12:23
  • టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం
  • ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష స‌రికాదు
  • అటువంటి భాష‌ను స‌మ‌ర్థించేలా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు
  • కేంద్రం నుంచి బ‌ల‌గాల‌ను పంపాల‌ని కోర‌డం ఏంటి
botsa slams pawan
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ బంద్ నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీపై ఏపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేత‌లు మాట్లాడుతోన్న అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష స‌రికాద‌ని చెప్పుకొచ్చారు.

అటువంటి భాష‌ను స‌మ‌ర్థించేలా జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేంద్రం నుంచి బ‌ల‌గాల‌ను పంపాల‌ని కోర‌డం ఏంట‌ని వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీతో మిత్ర‌త్వం కొన‌సాగిస్తున్నానంటూ.. మ‌రోవైపు చంద్రబాబు పార్టనర్ గా పవన్ క‌ల్యాణ్ టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను సమర్థిస్తుండ‌డం సిగ్గుచేటు అని ఆయ‌న అన్నారు.

టీడీపీ నేత‌ పట్టాభిరామ్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడి సమాధానం ఏంటని ఆయ‌న నిల‌దీశారు. సోము వీర్రాజు కూడా చంద్రబాబు నాయుడిని స‌మ‌ర్థిస్తూ మాట్లాడ‌డంలో ఆంతర్యమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామ‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు.