వివాహమైన 45 ఏళ్లకు మాతృత్వపు మధురిమ.. 70 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

20-10-2021 Wed 10:08
  • గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన ఆ మహిళ పేరు జివున్‌బెన్ రబరి  
  • జివున్‌పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన ‘డెయిలీ మెయిల్’
  • అతి పెద్ద వయసులో పిల్లల్ని కన్న జాబితాలో జివున్‌కూ చోటు
70 year old Indian woman gave birth in gujarat
వివాహమైన 45 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయసులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్ద వయసులో తల్లి అయిన అతి కొద్దిమంది మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది. గుజరాత్‌లో జరిగిందీ ఘటన. మోరా గ్రామానికి చెందిన ఆ వృద్ధురాలి పేరు జివున్‌బెన్ రబరి. వయసు 70 సంవత్సరాలు. ఆమె భర్త పేరు మల్దారి. వయసు 75 సంవత్సరాలు. సంతానం లేకపోవడంతో వీరు మొక్కని దేవుడు లేడు.

ఎలాగైనా మాతృత్వపు మధురిమలు ఆస్వాదించాలన్న జివున్‌బెన్ కోరిక చివరికి ఐవీఎఫ్ ద్వారా సాకారమైంది. బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీ మెయిల్’ పత్రిక జివున్‌పై ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. అయితే, తనకు 70 ఏళ్లని నిరూపించుకునేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని జివున్ చెబుతోంది.

నిజానికి ఈ వయసులో పిల్లల్ని కనడం దాదాపు అసాధ్యమని తొలుత వారికి చెప్పామని వైద్యుడు నరేశ్ భానుశాలి పేర్కొన్నారు. అయితే, వారి కుటుంబంలోని అందరూ లేటు వయసులోనే పిల్లల్ని కన్నారని చెప్పడంతో ముందడుగు వేశామన్నారు. తాను చూసిన వాటిలో ఇదే అత్యంత అరుదైన ఘటన అని వైద్యుడు పేర్కొన్నారు.