పరిస్థితులు దిగజారకముందే ఏపీలో కేంద్ర బలగాలను మోహరించండి: రాష్ట్రపతి, కేంద్రమంత్రికి రఘురామ కృష్ణరాజు లేఖలు

20-10-2021 Wed 09:52
  • దాడుల వెనక ఉన్నదెవరో నిగ్గు తేల్చండి
  • అవసరమైతే సీబీఐ లేదంటే ఎన్ఐఏతో విచారణ జరిపించండి
  • ఏపీ పోలీసులు నమ్మకం కోల్పోయారు
  • మీరు జోక్యం చేసుకోకుంటే కష్టం
MP Raghurama Raju writes letters to president ramnath kovind and Amit shah
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యాలయంపై దాడులను నిరసిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు  లేఖలు రాశారు. ఆ దాడుల వెనక ఉన్నదెవరో నిగ్గుతేల్చాలని ఆ లేఖల్లో కోరారు. ఇందుకోసం అవసరమైతే సీబీఐ, ఎన్ఐఏతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారకముందే చర్యలు తీసుకోవాలని, కేంద్ర బలగాలను ఏపీకి పంపాలని కోరారు. అలాగే, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేసి ఆయన భార్య, పిల్లలను దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర పోలీసులు నమ్మకం కోల్పోయారని, కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని దాడుల వెనకున్న కుట్రదారులు ఎవరో తేల్చాలని కోరారు.