పోలీసులు అడ్డుకోలేదంటేనే వెనక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు: కోమటి జయరాం

20-10-2021 Wed 08:33
  • ఇవి కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత దాడులే
  • వాటి వెనక ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థమైంది
  • విమర్శలు జీర్ణించుకోలేకే గూండాగిరి
Komati Jayaram Said people know Who is back on attacks
టీడీపీ కార్యాలయం, నేతలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగినా ఎక్కడా పోలీసులు అడ్డుకోకపోవడాన్ని బట్టి చూస్తే ఈ ఘటనల వెనక ఎవరు ఉన్నదీ ఇట్టే అర్థం చేసుకోవచ్చని టీడీపీ సీనియర్ నేత, ఎన్నారై కోమటి జయరాం అన్నారు. దాడులపై ఆయన స్పందిస్తూ.. టీడీపీ కార్యాలయాలపై జరిగినవి రాజకీయ ప్రేరేపిత దాడులేనని అన్నారు. ఈ దాడుల వెనక ఎవరు ఉన్నారు? వారి ఉద్దేశాలు ఏమిటనేది ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.

పాలన చేతకాని ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను జీర్ణించుకోలేక ఇలా గూండాగిరికి దిగుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గంజాయితో పట్టుబడుతున్న వాహనాలు ఏపీ నుంచి వచ్చినవేనని ఆధారాలతో సహా వార్తలు వస్తాయని, దీనిని టీడీపీ ప్రశ్నించడమే తప్పా? అని అడిగారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు, ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అని జయరాం నిప్పులు చెరిగారు.