125 డాలర్లు, ఓ ఫ్లాట్.. సూసైడ్ బాంబర్లకు ఆఫ్ఘన్ మంత్రి బంపరాఫర్

20-10-2021 Wed 06:59
  • షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్న సూసైడ్ బాంబర్లు
  • వారు అమరవీరులని ప్రశంస
  • వారి త్యాగాలు మరువలేనివని కొనియాడిన హోంమంత్రి
Taliban minister promise cash land to families of suicide bombers
ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. వారు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో నిన్న జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 10,000 ఆఫ్ఘానీలు (125 డాలర్లు), ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్టు స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.