కేసీఆర్ అధికార పీఠం అధిరోహించడానికి ముందుగా మోసం చేసింది దళితులనే: విజయశాంతి

19-10-2021 Tue 22:25
  • నిలిచిన దళితబంధు!
  • విజయశాంతి స్పందన
  • ఇదంతా టీఆర్ఎస్ కుట్రేనని ఆరోపణ
  • ఈటల పేరుతో దొంగలేఖ సృష్టించారని వెల్లడి
Vijayasanthi slams CM KCR and TRS Govt
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకానికి బ్రేకులు పడడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఇదంతా కేసీఆర్ పనేనని ఆరోపించారు. లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయించి, ఆపై డ్రా చేసుకోకుండా వెంటనే ఫ్రీజ్ చేయించారని వివరించారు. ఆ విధంగా ఎన్నికల కోడ్ కారణంగా దళితబంధు నిలిచిపోయే వరకు తీసుకొచ్చారని తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు దళితబంధును ఈసీతో నిలిపివేయించి, ఈటల రాజేందర్ పేరుతో దొంగలేఖను సృష్టించారని, ఇదంతా టీఆర్ఎస్ కుట్రేనని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే చేస్తే ప్రజలు ఊహించని సంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీకి పంపించారని, ఇప్పుడు హుజూరాబాద్ లోనూ అధికార పార్టీకి అలాంటి ఫలితమే ఎదురవుతుందని స్పష్టం చేశారు.

గడచిన ఏడేళ్లలో దళితులకు మిగిలింది కన్నీరేనని, కేసీఆర్ అధికార పీఠం ఎక్కేముందుగా మోసం చేసింది దళితులనేనని విజయశాంతి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని అన్నారని, ఆ విధంగా దళిత సామాజిక వర్గాన్ని పావుగా వాడుకున్నారని దుయ్యబట్టారు.