రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు

19-10-2021 Tue 20:45
  • టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ దాడులు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్న చంద్రబాబు
  • రాష్ట్రపతి పాలనకు డిమాండ్
  • ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరిన చంద్రబాబు  
TDP Supremo Chandrababu calls for state bandh tomorrow
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ దాడులపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.... తాను సాధారణంగా బంద్ లకు పిలుపు ఇవ్వనని, కానీ నేడు జరిగిన ఘటనలతో బంద్ కు పిలుపు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏనాడూ రాష్ట్రంలో 356 ఆర్టికల్ అమలు చేయాలని తమ పార్టీ గతంలో ఎప్పుడూ కోరలేదని, కానీ ఇవాళ్టి ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముందో చెప్పాలని అన్నారు. గతంలో ఎక్కడైనా 356 ఆర్టికల్ అమలు చేసి ఉంటే, ఇంతకంటే బలమైన కారణాలు అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి కాదా? ప్రతి ఒక్క పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.