హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ముట్టడి... కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు

19-10-2021 Tue 18:43
  • సీఎం జగన్ పై పట్టాభి విమర్శలు
  • వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • పరిస్థితిని గవర్నర్ కు వివరించిన చంద్రబాబు
  • కేంద్ర హోంశాఖ వర్గాలకూ నివేదన
Chandrababu seeks central forces security to tackle attacks on TDP leaders
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై ఇవాళ ఒక్కసారిగా దాడులు జరుగుతుండడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసంతో పాటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడి, పలు జిల్లాల్లో దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నేటి దాడిలో దెబ్బతిన్న వైనాన్ని చంద్రరబాబు స్వయంగా పరిశీలించారు. అనంతరం కేంద్ర హోంశాఖ వర్గాలతోనూ చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ, ఇవాళ్టి ఘటనలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరారు. కాగా, దీనిపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ బలగాలను పంపించేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించిందని వెల్లడించాయి.

పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సీఎం జగన్ పై నేడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే వైసీపీ శ్రేణులు ఈ దాడులకు తెగబడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.