దళితబంధును కేసీఆరే ప్రారంభించి.. ఆయనే ఆపించారు: విజయరామారావు

19-10-2021 Tue 17:47
  • దళితబంధుపై ఈసీకి ఫిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీనే
  • బీజేపీ ఆపించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే విషయం కేసీఆర్, కేటీఆర్ కు తెలుసు
KCR is behind complaining on Dalit Bandhu says Vijaya Ramarao
మరో 10 రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఆపేసింది. దీనికి బీజేపీనే కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు విజయరామారావు స్పందిస్తూ... దళితబంధుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఫిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే దళితుల ఓట్లు కావాలని... అందుకే దళితబంధును కేసీఆర్ తానే ప్రారంభించి, తానే ఆగిపోయేలా చేశారని చెప్పారు. దళితబంధును బీజేపీ ఆపించిందని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దళితబంధును కేసీఆర్ ఆపిస్తారని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలుసని అన్నారు. దళితబంధును తొలుత స్వాగతించింది బీజేపీనే అని... అయితే హుజూరాబాద్ లోనే కాకుండా రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరామని చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే విషయం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ తెలుసని అన్నారు.