దళితుడైన నన్ను జగన్ మంత్రిని చేశారు: ఆదిమూలపు సురేశ్

19-10-2021 Tue 15:35
  • దళితులకు భరోసాను కల్పించిన ఘనత జగన్ దే
  • దళిత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు
  • దళితుల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
Jagan made me minister says Adimulapu Suresh
దళితులకు భరోసా, నమ్మకం, గౌరవాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగన్ అని కొనియాడారు. దళితుడైన తనను జగన్ మంత్రిని చేశారని చెప్పారు.

దళితుల వెనుకబాటుకు ప్రధాన కారణం సరైన చదువు లేకపోవడమేనని... అందుకే చదువుపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. దళిత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కడప జిల్లాలో జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో అణచివేతకు గురైన దళితులు అందరితో పాటు సమానంగా ఉండేలా జగన్ కార్యక్రమాలను తీసుకొస్తున్నారని సురేశ్ అన్నారు. దళితుల కోసం జగన్ తీసుకొచ్చిన పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. దళితుల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు దళితులంటే చులకన భావం ఉందని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే కావాలనే నీచమైన ఆలోచనతో దళితులకు చంద్రబాబు ద్రోహం చేశారని విమర్శించారు. దళితుల ఓటు బ్యాంకు కోసం బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దళితులకు ఎంతో చేస్తున్న జగన్ కు, వైసీపీకి అండగా ఉందామని పిలుపునిచ్చారు.