CI Srinivasa Rao: నక్కా ఆనంద్ బాబు తన వాంగ్మూలంలో పూర్తి వివరాలు చెప్పలేదు: నర్సీపట్నం సీఐ

  • గుంటూరు వచ్చిన నర్సీపట్నం పోలీసులు
  • నక్కా ఆనంద్ బాబు నివాసం వద్ద హైడ్రామా
  • గంజాయి వ్యవహారంలో వాంగ్మూలం నమోదు
  • ఆధారాలు ఏమీ లేవన్న నక్కా ఆనంద్ బాబు
  • నోటీసులు తీసుకోవాలన్న పోలీసులు
Narsipatnam CI explains Nakka Anand Babu statement

గంజాయి దందాపై ప్రెస్ మీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు నుంచి పోలీసులు ఎట్టకేలకు వాంగ్మూలం నమోదు చేశారు. అయితే, ఆయన వాంగ్మూలంలో పూర్తి వివరాలు వెల్లడించలేదని నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు ఆరోపించారు.

నల్గొండ జిల్లా పోలీసులు నర్సీపట్నంలో కాల్పులు జరిపారని, అదే రోజున స్మగ్లింగ్ వెనుక నేతల హస్తం ఉందని ఆనంద్ బాబు చెప్పారని సీఐ వివరించారు. అందుకే ఆధారాలు ఇవ్వాలని అడిగామని తెలిపారు. ప్రస్తుతం వాంగ్మూలం నమోదు చేశామని, కానీ ఆధారాలు ఏమీ లేవని ఆనంద్ బాబు అంటున్నారని సీఐ శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇస్తామంటే తీసుకోలేదని వెల్లడించారు. వాంగ్మూలంలో చెప్పిన అంశాలు సమగ్రంగా లేనందునే నోటీసులు ఇస్తున్నామని సీఐ అన్నారు.

కాగా, పోలీసులు తనకు బలవంతంగా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండడంపై నక్కా ఆనంద్ బాబు మెలిక పెట్టారు. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తిరిగి ఇస్తేనే నోటీసులు తీసుకుంటానని స్పష్టం చేశారు. నోటీసులు తీసుకోకపోతే గోడకు అంటించి వెళతామని పోలీసులు అంటున్నారు. దాంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది.

More Telugu News