కేసీఆర్ ‘రాష్ట్రపతి’ అవుతున్నారన్న ప్రచారంపై కేటీఆర్ వివరణ

19-10-2021 Tue 14:49
  • ‘కేసీఆర్ రాష్ట్రపతి’ అన్నది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే
  • నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ
  • భారీగా ఆర్టీసీ బస్సులను తీసుకుంటాం
  • భట్టి మంచోడు.. ఆయన మాటకు కాంగ్రెస్ లో విలువ లేదు
  • కొన్ని రోజుల తర్వాత ఈటలకు కాంగ్రెస్ ఆహ్వానం
KTR Clarifies On KCR As President Comments
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికీ వెళ్లలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమన్నది సందర్భాన్ని బట్టి ఉంటుందని, ఆయనకు రాష్ట్రపతి పదవి ఇస్తారన్నది కేవలం వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమేనని చెప్పారు.

కొండగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్.. ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు ఇవి తొలి ఎన్నికలని, వాటిలో తానేంటో నిరూపించుకునేందుకు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ లోకి ఈటలను ఆహ్వానిస్తారని, వివేక్ కూడా వెళ్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.

కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని, కానీ, ఆయన మాటకు పార్టీలో లెక్కలేదని, గట్టి అక్రమార్కుల మాటలకే విలువ ఉందని అన్నారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు వేగంగా సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆ రోజు ఆర్టీసీ బస్సులను భారీగా తీసుకుంటామని, ప్రజలెవరూ ఆ రోజున ప్రయాణాలు పెట్టుకోవద్దని కేటీఆర్ సూచించారు.

20 రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ను 100 శాతం పూర్తి చేస్తామన్నారు. నీట్ రద్దు విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పూర్తిగా ఏకీభవించలేమని ఆయన తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని, విద్యార్థులకు మేలైన నిర్ణయమే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 15 తర్వాత తమిళనాడు వెళ్లి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నిర్మాణంపై అధ్యయనం చేస్తామని కేటీఆర్ చెప్పారు.