తెలుగు బుల్లితెర నటుడు పవిత్రనాథ్ పై భార్య సంచలన ఆరోపణలు

19-10-2021 Tue 14:24
  • మొగలిరేకులు సీరియల్ లో నటించిన పవిత్రనాథ్
  • దయా పాత్రతో ఎంతో గుర్తింపు
  • 2009లో శశిరేఖతో వివాహం
  • తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్న భార్య
  • పవిత్రనాథ్ స్త్రీలోలుడు అని ఆరోపణ
Wife sensational allegations on Telugu TV actor Pavitranath
అప్పట్లో తెలుగు బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ పెద్ద హిట్. ముఖ్యంగా మహిళా అభిమానులను ఈ సీరియల్ ఎంతగానో అలరించింది. ఇందులో నటించిన పవిత్రనాథ్ కు ఎంతో గుర్తింపు లభించింది. మొగలిరేకులులో దయా పాత్ర పోషించిన తర్వాత పవిత్రనాథ్ ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే, అతడి భార్య శశిరేఖ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త పవిత్రనాథ్ ఓ స్త్రీలోలుడు అని ఆరోపించింది.

తమకు 2009లో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. అమ్మాయిలంటే అతడికి పిచ్చి అని, తనను చిత్రహింసలకు గురిచేసేవాడని వివరించింది. పవిత్రనాథ్ జాతకాలు కూడా చెబుతుంటాడని, జాతకాలు చెబుతానని అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చి వారితో గంటలకొద్దీ గడుపుతుంటాడని, ఇదేమిటని తాను ప్రశ్నిస్తే తాగొచ్చి నానా రగడ చేస్తుంటాడని శశిరేఖ వాపోయింది.

అత్తమామల నుంచి కూడా తనకు మద్దతు లేదని, తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆమె ఆరోపించింది. కట్నం కోసం వారు తనను ఎంతో వేధించారని పేర్కొంది.

పవిత్రనాథ్ ఓ అమ్మాయితో ఎనిమిదేళ్లు ప్రేమాయణం నడిపాడని, అతడి అఫైర్లపై అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. విడాకులు ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని శశిరేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అతడ్ని అరెస్ట్ చేయాలని కోరింది. అందుకే న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కార్యాలయానికి వచ్చానని వివరించింది.