Congress: బంగ్లాదేశ్ లో అల్లర్లు.. హిందువుల కోసం సీఏఏ కావాలన్న కాంగ్రెస్ నేత

  • చట్టంలో సవరణలు చేయాలన్న మిలింద్ దేవరా
  • మతకలహాలను బంగ్లాదేశ్ పెంచిపోషిస్తోందని ఆరోపణ
  • హిందువులు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన
Congress Leader Milind Deora Bats For CAA For Persecuted Hindus In Bangladesh

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ముందు నుంచీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంది. అయితే, ఆ పార్టీ నేత ఒకరు తాజాగా సీఏఏకి మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువులపై ఇటీవల దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా 20 మంది హిందువుల ఇళ్లకు అక్కడి వారు నిప్పుపెట్టారు. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా.. మతకలహాలను బంగ్లాదేశ్ పెంచిపోషిస్తోందని ఆరోపించారు.

బంగ్లాదేశీ హిందువులకు భారత్ లో పునరావాసం కల్పించే విధంగా సీఏఏలో సవరణలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కడి హిందువులు అణచివేతకు గురవుతున్నారన్నారు. అదే సమయంలో బంగ్లాదేశీ ఇస్లామిస్ట్ లతో పోలుస్తూ భారత ముస్లింలపై దాడులు జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, సీఏఏ అవసరం ఎంతుందో బంగ్లాదేశ్ ఘటన నిరూపిస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఇప్పటికే కామెంట్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల మత స్వేచ్ఛను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏని వ్యతిరేకించిన మమత బెనర్జీ.. ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అకృత్యాల పట్ల కూడా మాట్లాడడం లేదని, తృణమూల్ ప్రభుత్వంలో బెంగాల్ లోని హిందువులకూ రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బంగ్లాదేశ్ ఘటనల నేపథ్యంలో ఆ దేశానికి సరిహద్దు జిల్లాల్లో బెంగాల్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.

More Telugu News