Xiaomi: షావోమి కార్లు.. స్మార్ట్ ఫోన్ల సంస్థ సీఈవో ఆసక్తికర ప్రకటన

Xiaomi CEO Announces They Produce EVs In 2024 First Half
  • 2024 ప్రథమార్ధంలో ఈవీల తయారీ
  • 5.4 శాతం పెరిగిన సంస్థ షేర్ విలువ
  • ఇప్పటికే కార్ల యూనిట్ కు రిజిస్ట్రేషన్
  • సిబ్బంది నియామకాల్లో వేగం పెంచిన సంస్థ
షావోమి అనగానే మామూలుగా అయితే ఫోన్లే గుర్తుకు వస్తాయి. కొన్నేళ్లయితే ఫోన్లతో పాటు కార్లనూ గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి అడుగిడుతున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ ప్రకటించింది. తాజాగా ఆ కార్లను ఎప్పుడు తయారు చేసేది సంస్థ సీఈవో లై జున్ వెల్లడించారు. షాంఘైలో జరిగిన ఇన్వెస్టర్ల ఈవెంట్ సందర్భంగా ఇవాళ ఆయన సంస్థ ఈవీల గురించి మాట్లాడినట్టు సంస్థ ప్రతినిధి చెప్పారు.

2024 ప్రథమార్ధంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని లై జున్ ప్రకటించారన్నారు. స్థానిక మీడియాలో వచ్చిన ఆ కథనాలను సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ ప్రకటనతో షావోమి సంస్థ షేర్ విలువ 5.4 శాతం పెరిగింది. మే 12 నుంచి ఇదే అత్యంత ఎక్కువ పెరుగుదల కావడం విశేషం. ప్రస్తుతం తమ అతిపెద్ద లక్ష్యాల్లో ఈవీల తయారీయే ముందుందని సంస్థ అంతర్గత మార్కెటింగ్ విభాగ డైరెక్టర్ జాంగ్ జియువాన్ చెప్పారు.

కాగా, విద్యుత్ కార్ల తయారీలో వెయ్యి కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని ఈ ఏడాది మార్చిలో సంస్థ ప్రకటించింది. ఆగస్టులో తన ఈవీ యూనిట్ ను రిజిస్టర్ కూడా చేయించింది. ఆ యూనిట్ లో పనిచేసేందుకు సిబ్బంది నియామకాన్నీ వేగవంతం చేసింది. అయితే, తన సొంతంగా కార్లను తయారు చేస్తుందా? లేదంటే ఇప్పటికే ఉన్న సంస్థతో భాగస్వామి అవుతుందా? అన్న విషయాన్ని మాత్రం సంస్థ ఇప్పటిదాకా వెల్లడించలేదు.
Xiaomi
Smart Phones
Electric Vehicles
Lei Jun
China

More Telugu News