USA: ఆవాల నూనెతోనూ విమానాలు ఎగురుతాయ్.. భారతీయ శాస్త్రవేత్త ఘనత

  • కర్బన ఉద్గారాలను 68% తగ్గించొచ్చన్న పునీత్ ద్వివేది
  • లీటర్ ఇంధనానికి 0.12 డాలర్లే ఖర్చు
  • అమెరికా చేపట్టిన ప్రాజెక్టులో కీలక పాత్ర
Indian Origin Scientist In US Finds Plant Based Clean Fuel For Aviation Industry

సాధారణంగానే విమాన ఇంధనానికి (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్– ఏటీఎఫ్) ధర ఎక్కువ. పైగా దాని ద్వారా కాలుష్యమూ పెరిగిపోతోంది. మరి, ఒకేసారి ఇటు ఖర్చును, అటు కాలుష్యాన్ని తగ్గించే మార్గమే లేదా? అంటే ఓ చక్కని పరిష్కారాన్ని చూపించారు అమెరికాలోని భారతీయ శాస్త్రవేత్త. అసలు ఏటీఎఫ్ అవసరం లేకుండా ఒక రకం ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమానాలను నడపవచ్చని చెబుతున్నారు. జార్జియా యూనివర్సిటీలోని వార్నెల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ నేచురల్ రీసోర్సెస్ విభాగ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పునీత్ ద్వివేది.. మరో ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి నాలుగేళ్లుగా ‘సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్’ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు.


బ్రాసినా కారినాటా (ఆవాల మొక్క) మొక్క నుంచి తీసిన నూనె ద్వారా విమాన ఇంధనాన్ని తయారు చేస్తే.. కర్బన ఉద్గారాలను 68 శాతం వరకు తగ్గించొచ్చని పునీత్ చెప్పారు. ఆవాల మొక్క నుంచి లీటర్ ఇంధనాన్ని తయారు చేసేందుకు అయ్యే ఖర్చు కేవలం 0.12 డాలర్లేనన్నారు. సాధారణంగా వాడే విమాన ఇంధన ధరతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువని చెప్పారు. కావాల్సిన ముడి సరుకు, ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తయారు చేస్తామని పునీత్ చెప్పారు.

అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్.. కోటిన్నర డాలర్లతో ‘సౌత్ ఈస్ట్ పార్ట్ నర్ షిప్ ఫర్ అడ్వాన్స్ డ్ రెన్యూవబుల్స్ ఫ్రమ్ కారినాటా’ అనే ప్రాజెక్టును చేపట్టింది. నాలుగేళ్లుగా పునీత్ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. అమెరికా దక్షిణ ప్రాంతంలో ఆవాలను ఎక్కువగా పండించడంపై దృష్టి సారించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన చలికాలం ప్రభావం తక్కువగానే ఉంటుందని, కాబట్టి ఆవాల పంటకు దక్షిణాది అనువుగా ఉంటుందని పునీత్ సూచిస్తున్నారు.

More Telugu News