‘మన బంధాన్ని జనానికి ఎప్పుడు చెప్పేద్దాం?’ అంటూ నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే జవాబిచ్చిన పూజ హెగ్డే!

19-10-2021 Tue 11:59
  • ట్విట్టర్ లో అభిమానులతో పూజ సరదా ముచ్చట్లు
  • ఇబ్బందిపెట్టే ప్రశ్న అడిగిన నెటిజన్
  • ‘రక్షాబంధన్’ రోజున బయటపెడదామంటూ ఘాటు రిప్లై
  • చిరంజీవి, ఎన్టీఆర్, విజయ్, యశ్ ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన బుట్టబొమ్మ
Pooja Hegde Shuts Netizen Up By Giving Strong Reply
తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతోంది కథానాయిక పూజా హెగ్డే. ఆమె నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో ట్విట్టర్ లో సరదాగా ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అంతే దీటుగా బదులిచ్చింది. ‘మన మధ్య ఉన్న బంధం గురించి జనానికి ఎప్పుడు చెప్పేద్దాం?’ అంటూ అతను అడిగిన ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబు చెప్పింది. ‘రక్షాబంధన్’ రోజున చెబుదామంటూ చురక అంటించింది.

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలన్న అభిమాని ప్రశ్నకు.. ఆయన ‘నిజం’ అంటూ చెప్పింది. రాధేశ్యామ్ ఓ ఎపిక్ లవ్ స్టోరీ అని, అద్భుతమైన విజువల్స్ ఉంటాయని తెలిపింది. తమిళ హీరో విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని, ఆయన స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొంది. అలాగే, కన్నడ ఇండస్ట్రీని కేజీఎఫ్ హీరో యశ్ గర్వించేలా చేశాడని ఆమె చెప్పింది.

పెద్ద హీరోలతో, పెద్ద సినిమాల్లో నటించడం వల్ల తక్కువ నిద్రపోతూ ఎక్కువ విమానాలు ఎక్కేస్తున్నానని చెప్పింది. ఆచార్యలో ‘నీలాంబరి’ పాట విజువల్ పరంగా చాలా బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆ పాట చేసిన క్షణాలను మరచిపోలేనని చెప్పింది.

ఇక చిరంజీవి గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూసి తనకు కాంప్లిమెంట్ తో కూడిన మెసేజ్ పంపారని, అది చూశాక మరింత కష్టపడి పనిచేయాలన్న ప్రేరణ కలిగిందని ఆమె తెలిపింది.

అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాలనేది తన కల అని, ఏదో ఒక రోజు ఆ కలను సాకారం చేసుకుంటానని చెప్పింది. ‘ఇన్ టు ద వైల్డ్’ అనే ఇంగ్లిష్ సినిమా చూసి బాగా కలత చెందానని, అది బాగా డిస్టర్బ్ చేసిందని తెలిపింది.