ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: దేవినేని ఉమ

19-10-2021 Tue 11:20
  • ఈ ఏడాది అమ్మఒడిని ప్రభుత్వం ఎగ్గొట్టింది
  • విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు
  • అందరికీ అమ్మఒడి అని చెప్పి.. ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారు
Devineni Uma fires on Jagan
ఈ ఏడాది అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ఈ ఏడాది అమ్మఒడిని ప్రభుత్వం ఎగ్గొట్టిందని అన్నారు. ప్రభుత్వ తీరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి... అధికారంలోకి వచ్చాక ఒక్కరికేనని మోసం చేశారని మండిపడ్డారు. విదేశీ విద్య, స్కాలర్ షిప్ లకు మంగళం పాడారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా చెప్పండి జగన్ గారూ? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు ఓ న్యూస్ ఛానల్ లో వచ్చిన కథనాన్ని జత చేశారు.