కన్నడ టీవీ నటి సౌజన్యది ఆత్మహత్యే.. తేల్చిసిన వైద్యులు

  • గత నెల 30న ఇంట్లో విగతజీవిగా కనిపించిన సౌజన్య
  • పలు సీరియళ్లతోపాటు సినిమాల్లోనూ నటన
  • తమ కుమార్తెది హత్యేనన్న సౌజన్య తండ్రి
  • పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్యేనని ధ్రువీకరణ
It is Suicide said police in Kannada television actress Soujanya case

గత నెల 30న అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కన్నడ టీవీ, సినీ నటి సౌజన్యది ఆత్మహత్యేనని వైద్యులు తేల్చారు. ఈ మేరకు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బెంగళూరులోని కుంబళగోడులోని తన ఇంట్లో గత నెల 30న సౌజన్య విగతజీవిగా కనిపించింది. సౌజన్య ఆత్మహత్య వార్త కన్నడ టెలివిజన్ రంగాన్ని కుదిపేసింది.

25 ఏళ్ల సౌజన్యది కొడుగు జిల్లాలోని కుశాల్ నగర్ కాగా వృత్తిపరంగా బెంగళూరులో ఉంటోంది. అనారోగ్యపరమైన సమస్యలతోపాటు టెలివిజన్ రంగంలోనూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆత్మహత్యకు ముందు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మూడు వేర్వేరు తేదీలతో అంటే సెప్టెంబరు 27, 28, 30 తేదీలలో ఆ నోట్ రాసినట్టుగా ఉంది.

అయితే, తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు సౌజన్య స్నేహితుడు వివేక్‌ను విచారించారు. కాగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తాజాగా నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. సౌజన్య పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది.

More Telugu News