ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా

19-10-2021 Tue 07:25
  • టీడీపీ తమను ఎంతో గౌరవించిందన్న కుతూహలమ్మ
  • అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన
  • వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
Gummadi Kuthuhalamma Resigns TDP
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ బాధ్యుడు హరికృష్ణ కూడా పార్టీకి, నియోజకవర్గ బాధ్యుడి పదవికి రాజీనామా చేశారు.

తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.

వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో తొలిసారి వేపంజేరి (జీడీ నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1989, 1999, 2004లో విజయం సాధించారు.

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కుతూహలమ్మ పనిచేశారు. 2007లో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి కాంగ్రెస్ తరపున జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతరం 2014లో టీడీపీలో చేరారు.